| |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
గొడ్డలి పెట్టు = ఆపద కలిగించు | నాప్రగతిని చూడలేక మన చుట్టూ ఉన్న వాళ్ళు గొడ్డలిపెట్టలా అడ్డంపడ్డారు అను చెప్పు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. |
కాలికి బుద్ధి చెప్పు = భయపడి పారిపోవు. | కుక్కలు తరుముకొస్తుంటే నేను కాలికి బుద్ధి చెప్పాను అను చెప్పు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. |
కండ్లు కాయలు కాచు = ఎంతో ఆశతో ఎదురు చూచు | మా స్నేహితుల కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూశాను అను చెప్పు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. |
గుడ్లప్పగించి చూచు = తదేక దృష్టితో చూసుకోవడం | నాకళ్ళ యెదుట ఘోరం జరుగుతూ ఉంటే గుడ్లప్పగించి చూశాను అను చెప్పు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. |
మసిపూసి మారేడుకాయ-మోసం చేయడం | నా మిత్రుడు తన మాటలతో మసిపూసి మారేడుకాయచేసి ఇతరులను నమ్మిస్తాడు అను చెప్పు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. |
పొల్లుపోకుండా = పూర్తిగా | పాఠంలోని పద్యాలు పొల్లుపోకుండా అప్పజెప్పాను అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. |
మిరుమిట్లు గొలుపు = దృష్టిని చెదర చేయు | ఆకాశంలో మెరుపులు మిరుమిట్లు గొలుపుతున్నాయి అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. |
కాలుగాలిన పిల్లి! | వెనకటికి నలుగురు అన్నదమ్ములు ఉండేవాళ్లు. ఈ నలుగురు కలిసి ఒక పిల్లిని పెంచుకోవడం మొదలు పెట్టారు. 'ఈ కాలు నాది ఆ కాలు నీది' అంటూ పిల్లి కాళ్లను నలుగురూ పంచుకున్నారు. తమకు కేటాయించబడిన కాళ్లను చాలా మురిపెంగా చూసుకునేవారు.ఒకసారి పిల్లి కాళ్లలో ఒకదానికి గాయం అయింది. అది తనకు కేటాయించిన కాలు కాబట్టి సోదరుల్లో ఒకడు దానికి కట్టుకట్టాడు. ఈలోపు కట్టుగట్టిన కాలుకి నిప్పు అంటుకుంది. పిల్లి కుయ్యే మొర్రో అనుకుంటూ వెళ్లి బట్టలపై పడింది. “నీ (పిల్లి) కాలు వల్ల మా బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి" అని మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు తమ సోదరుడిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. "తక్కిన మూడు కాళ్లు సహకరించకపోవడం వల్లే...భారమంతా గాయపడిన వేలుపై పడి...పిల్లి సరిగ్గా పరుగెత్తలేక బట్టలపై పడింది. ఇందులో పిల్లి చేసిన తప్పేమీ లేదు" అన్నాడు గాయపడిన కాలుకు చెందిన సోదరుడు. న్యాయస్థానం కూడా 'నిజమే కదా మరి. మిగిలిన మూడు కాళ్లు సహకరిస్తే ఇలా జరిగేదా' అంది. ఈ పిట్టకథ సంగతి ఎలా ఉన్నా.... ఆందోళనగా, హడావిడిగా పరుగులు పెట్టే వ్యక్తులను, పనీపాట లేకున్నా ఏదో పని ఉన్నట్లు హడావిడిగా పరుగులు తీసే వ్యక్తులను కాలుగాలిన పిల్లితో పోల్చుతుంటారు. |
చుక్కలను చూసి కుక్క మొరిగినట్లు! | ఒకరోజు ఒక కుక్కను యజమాని తిట్టాడు. విశ్వాసం గల కుక్క ఆ యజమాని తిట్లను భరించింది. అయితే యజమానిపై కడుపులో మంట, కోపం... ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఏంచేయగలదు! ఇల్లు దాటి అలా బయటికి వచ్చింది. అటు చూసింది. ఇటు చూసింది. ఆకాశానికేసి చూసింది. ఆకోపంలో ఆకాశంలో ఉన్న చుక్కలు దానికి నచ్చలేదు. కోపంతో భౌభౌమని మొరగసాగింది. మొరగడం వల్ల కుక్కకు ఆయాసం వచ్చిందేగానీ చుక్కలకు వచ్చిన నష్టమంటూ ఏదైనా ఉందా ! తమ స్థాయి తెలియకుండా అనాలోచితంగా పెద్దలను విమర్శించే అల్పుల విషయంలో ఉపయోగించే మాట 'చుక్కలను చూసి కుక్క మొరిగినట్లు!' |
ద్విపాద పశువు! | తెలివి నుంచి విచక్షణ, విలువల వరకు... పశువులతో పోల్చితే మనిషి అనేవాడు ఒక మెట్టు పైనే ఉంటాడు. అందుకే మనిషి గొప్పవాడు అయ్యాడు.కొందరు చూడడానికి మనుషుల్లాగే కనిపించినా పశువుల్లా ప్రవర్తిస్తారు.ఏది మంచీ, ఏది చెడు అనే విచక్షణను కోల్పోతారు. ఇలాంటి వాళ్లను ఉద్దేశించి... 'వాడు పేరుకే మనిషి' అని తిడుతుంటారు.'పేరుకు మనిషి' బాపతు మనుషులను 'ద్విపాద పశువు' అంటుంటారు. అంటే రెండు కాళ్ల జంతువు అన్నమాట! |
అల్లుడు రాలేదని అమావాస్య ఆగుతుందా? | వివరణ :సంక్రాంతిని ప్రజలందరూ ఎంతో ఘనంగా
జరుపుకుంటారు.ఈ పండుగకు కొత్తగా పెళ్లైన అల్లుళ్ళు అత్తవారింటికి వెళ్ళే ఆచారం ప్రజలలో ఎక్కువగా ఉంది. ఈ ఆచారాన్ని సామెతగా తీసుకొని జానపదులు చక్కగా చెప్పారు. అందుకే, సకాలంలో మన పనులు పూర్తి చేసుకోవాలనే జీవనరీతిని చెపుతూ ఈ జాతీయాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. |
అడకత్తెరలో పోకచెక్క | అర్థం : రెండువైపుల ఒత్తిడి కలిగి ఉండడం
వివరణ : పంటలు పండక, పన్నులు కట్టలేక రైతులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. |
అరికాలిమంట నెత్తికెక్కడం | అర్థం : కోపం అధికం కావడం
వివరణ: మితిమీరిన విద్యార్థుల అల్లరితో ఉపాధ్యాయునికి అరికాలిమంట నెత్తికెక్కింది. |
అవాకులు చవాకులు | అర్థం : అసందర్భపు మాటలు
వివరణ : కొందరు అవాకులు చవాకులు మాట్లాడి కష్టాలను కొని తెచ్చుకుంటారు. |
అడవి కాచిన వెన్నెల | అర్థం : వ్యర్థమైన పని
వివరణ : ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి మనశ్రమంతా అడవి కాచిన వెన్నెలే అవుతుంది. |
అంటీ అంటనట్లు | అర్థం : పట్టించుకోకుండా ఉండడం
వివరణ : మనకు సంబంధం లేని విషయాల్లో అంటీ అంటనట్లు ప్రవర్తించాలి. |
తొడ మీద అగ్గి! | వివరణ : అవసరం కోసం ఇతరుల మీద ఆధారపడటం వేరు. గొప్పల కోసం ప్రతి చిన్న పనికీ ఇతరుల ఆధారపడటం వేరు. అలా చిన్నచిన్న పనులకు సైతం ఇతరుల మీద ఆధారపడుతూ తమకు తాము నష్టం చేసుకునే వారి విషయంలో వాడే జాతీయం ఇది. |
తిల తండులాలు! | వివరణ : 'వాళ్ల దాంపత్యం తిల తండులాల లాంటిది. ఎప్పుడూ తగాదా పడుతూనే ఉంటారు.
'వాళ్లు స్నేహితుల్లా కనిపిస్తారు గానీ, తిల తండులాల లాంటి వ్యవహారం. ఒకరికి తెలియకుండా ఒకరు చేటు చేసుకుంటారు'.
ఏమిటీ తిల తండులాలు?
"తిలలు" అంటే నువ్వులు. "తండులాలు" అంటే బియ్యం. ఈ రెండింటిని యెంత బాగా కలిపినా సరిగ్గా కలవవు. తేడా కనిపిస్తూనే ఉంటుంది. స్నేహం విషయంలో గానీ, దాంపత్యం విషయంలో గానీ ........ 'పాలునీళ్లలా కలిసిపోవాలి'. అంటారు. అలా కలిసిపోకుండా కొందరు ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. అలాంటి వారిని తిల తండులాలతో పోల్చుతారు. |
చేదోడు వాదోడు! | వివరణ : 'నాకు తను చేదోడు వాదోడుగా ఉంటాడు'. 'నువ్వు చేదోడు వాదోడుగా లేకపోతే ఈ పని చేయగలిగే వాడిని కాదేమో ' ......... ఇలాంటి మాటలను నిత్యజీవితంలో వాడుతూనే ఉంటాం. మాట విషయములోనూ, పని విషయంలోనూ సహాయ సహకారాలు అందించడమే ఈ 'చేదోడు వాదోడు'.
చేయి + తోడు = చేదోడు
వాయి + తోడు = వాదోడు
చేయి అనేది పనికి సంబంధించిన భావనను - వాయి(నోరు) అనేది మాటకు సంబంధించిన భావనను ప్రతీకాత్మకముగా తెలియ జేస్తుంది. |
చర్విత చరణం! | చర్విత చరణం అనే మాట నిజానికి జంతువులకు సంబంధించినది. ఆవులు ఆబగా గడ్డి మేసేసి ....... తర్వాత తీరిగ్గా నెమరు వేస్తుంటాయి. ఈ పనిని చర్విత చరణం అంటారు. అయితే వ్యవహారంలో మాత్రం దీని అర్థం మారిపోయింది.
చెప్పిందే చెప్పడం, రాసిందే రాయడం వంటి విషయాలలో ఈ మాటను వాడుతున్నారు. |
అడుగులకు మడుగు లొత్తు | అర్థం : ఒకరిని విధేయతతో అనుసరించటం
కొందరు ఎప్పుడూ ఇతరుల అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారు. |
ఆరంభ శూరత్వం | అర్థం: పని ఆరంభంలో ఉన్న ఉత్సాహం చివరిదాకా లేకపోవడం
ఆంధ్రులు ఆరంభశూరులు కాక చివరి వరకు పోరాడి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నారు. |
ఉట్టి కట్టుకొని ఊరేగడం | అర్థం: చిరకాలం జీవించాలనే కోరిక
కాటికి కాళ్లు చాచుకున్న వాళ్ళు కూడా కలకాలం ఉట్టికట్టుకొని ఊరేగాలనుకుంటారు. |
ఆపాదమస్తకం | అర్థం :శరీరమంతా
ఒక్కసారిగా పామును చూసి మా స్నేహితుడు ఆపాదమస్తకం వణికిపోయాడు. |
ఆమూలాగ్రం | అర్థం : పూర్తిగా
నేను మా గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ ఆమూలాగ్రం చదివేశాను. |
ఇనుప గజ్జెల తల్లి | అర్థం : దరిద్ర దేవత |
ఇసుమంత | అర్థం : కొద్దిగా
వివరణ: మనం ప్రతి విషయంలోను ఇసుమంత తెలివిని ఉపయోగించాలి |
ఇంద్ర వైభవం | అర్థం : గొప్ప వైభవం
వివరణ: ఇంద్ర వైభవాన్ని అనుభవించే వారికి పేదల ఆకలి తెలియదు |
ఉత్తరకుమార ప్రజ్ఞలు | అర్థం : ఢాంబికాలు, గొప్పలు
వివరణ: కొందరు ఎప్పుడూ ఉత్తరకుమార ప్రజ్ఞలు పలుకుతూ ఉంటారు. |
ఉవ్విళ్ళూరు | అర్థం : తెలుసుకోవాలనే తపన
వివరణ: నా మిత్రుడు సాహసాలు చేయాలని ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. |
ఎండకన్నెరుగని | అర్థం : ఏ విధమైన కష్టాలూ అనుభవించకపోవడం
వివరణ: ఎండకన్నెరుగని సీత రామునితో పాటు పద్నాలుగేళ్ళు వనవాసం చేసింది |
ఎముకలేని చేయి | అర్థం : విరివిగా దానం చేయడం
వివరణ: కర్ణునిది దానంలో ఎముకలేని చేయి |
ఏకు మేకగుట | అర్థం : మిత్రునిగా చేరి శత్రుత్వం సాధించడం
వివరణ: కొందరు మిత్రునిలా దరిచేరి చివరికి శత్రువులా ఏకుమేకై కూర్చుంటారు |
కడుపులో చల్ల కదలకుండ | అర్థం : ఏమాత్రం శ్రమలేకుండా
వివరణ: ప్రతి మనిషి కడుపులో చల్ల కదలకుండా జీవితం గడిచిపోవాలని అనుకుంటాడు. |
కడుపు నిండిన బేరం | అర్థం : అవసరం లేని దానిని నిర్లక్ష్యంగా చూడడం
వివరణ: కడుపు నిండిన బేరం కాబట్టే, ధనవంతులు పేదల కష్టాలను గురించి ఆలోచించలేరు. |
కనుసన్నలలో మెలగడం | అర్థం : ఎదుటివారి అభిప్రాయానికి అనుగుణంగా మెలగడం
వివరణ: కొందరు ఉద్యోగులు తమ పై అధికారుల కనుసన్నలలో మెలుగుతూ ఉంటారు. |
కన్నుల నిప్పులు రాలు | అర్థం : కోపంతో కళ్ళు ఎర్రబడటం
వివరణ: అబద్దం చెప్పినందుకు ఉపాధ్యాయుడు విద్యార్థి మీద కన్నుల నిప్పులు రాల్చాడు |
కళ్ళలో నిప్పులు పోసుకొను | అర్థం : ఈర్ష్య కలిగి ఉండు
వివరణ: ఇతరుల అభివృద్ధిని చూసి కొందరు కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. |
ఎండల్లో ఏకులు వడికి, వానల్లో వడ్లు దంచినట్లు | కాలానుగుణంగా మనం ఎప్పుడు, ఏ పనులు చేయాలో అప్పుడు ఆ పనులు చేస్తేనే ఫలితముంటుంది. ఆయా కాలాల్లోని వాతావరణ మార్పులు మనం చేసే పనులపై ప్రభావం చూపుతాయి. ఇందుకు భిన్నంగా కొందరు తమకు తోచినప్పుడు పనులు మొదలు పెడుతూవుంటారు. తీరా సరైన ఫలితం రాకపోవడంతో ఇబ్బందుల పాలవుతారు. అలాంటి వారిని చూసినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతూవుంటారు. |
కబంధ హస్తాలు | కబంధుడు అనేవాడు రాక్షసుడు. పూర్వాశ్రమంలో అతడు విశ్వావసువు అనే గంధర్వుడు. తపస్సు చేసి, మరణం లేకుండా బ్రహ్మ ద్వారా వరం పొందుతాడు. వరగర్వం తలకెక్కడంతో ఏకంగా ఇంద్రుడితోనే తలపడతాడు. ఇంద్రుడి శాప ఫలితంగా తల, కాళ్లు లేని రాక్షస రూపం దాలుస్తాడు. మొండెం, చేతులు మాత్రమే మిగులుతాయి. మొండేనికి ఒక కన్ను, ముక్కు, నోరు ఉంటాయి. క్రౌంచ పర్వతం దగ్గర అడవిలో పడి ఉంటాడు. కాళ్లు లేక ఎక్కడికీ కదల్లేకపోయినా, అతడి చేతులు ఎంత దూరమైనా సాగుతాయి. జంతువులను, ఒక్కోసారి మనుషులను ఆ చేతుల్లోనే చిక్కించుకొని, శుభ్రంగా భోంచేసేవాడు. వనవాస కాలంలో రామలక్ష్మణులను కూడా అలాగే చేతుల్లో చిక్కించుకుంటాడు. రామలక్ష్మణులు అతడి చేతులు నరికి వేయడంతో శాప విమోచనం పొందుతాడు. అప్పటి వరకు ఎంత దూరమైనా సాగే కబంధుడి హస్తాల్లో చిక్కుకున్నవారు తప్పించుకోవడం అసాధ్యంగా ఉండేది. పరపతి గల పెద్దలు కనుచూపు మేరలోని ఆస్తులను కబ్జా చేసేస్తుంటే, అలాంటి ఆస్తులు కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయనడం వాడుకగా మారింది. |
చెంపపెట్టు, గోడ పెట్టు! | వెనుకటికి...... భార్యాభర్తలిద్దరు గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి భర్త చెంప మీద ఒక్కటిచ్చుకుంది భార్య. ఆ దెబ్బకు.... భర్త వెళ్లి గోడపై పడ్డాడు. దీనితో రెండో చెంపకు గోడదెబ్బ బలంగా తగిలింది. సదరు ఆ భర్త తన రెండు చెంపలను తడుముకుంటూ ....... 'చెంప పెట్టు... గోడపెట్టు. అటూ ఇటూ పోటు' అనుకున్నాడట. రెండు విధాలుగా బాధను అనుభవించే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది.
|
కవలవాడి తలనొప్పి! | కవల పిల్లలకు పోలికలు ఒకే రకంగా ఉంటాయనేది నిజమే గానీ..... ఒకరికి నొప్పి వస్తే ఇంకొకరికి వస్తుందా? అది సినిమాల్లో నిజమేమో గానీ ..... నిజజీవితంలో అది నిజంగా నిజం కాదు. సరే దీని సంగతి ఎలా ఉన్నా... ఒకరి బాధ ఇంకొకరి బాధ అయ్యే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది. కొన్ని సందర్భాల్లో.... బంధుత్వం వల్లో, స్నేహం వల్లో సమస్యల్లో ఇరుక్కుపోవలసి వస్తుంది. వారు చేసిన తప్పుతో ఎలాంటి సంబంధం లేకపోయినా.... నిష్కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: 'ఉత్తపుణ్యానికి చిక్కుల్లో పడ్డాను. కవలవాడి తలనొప్పి అనుకో' |
గాజులవారి మర్యాద | గాజులవారు తాము అమ్మే గాజులతో పాటు ఒక దుప్పటిని కూడా తమతో పాటు తీసుకెళ్లేవారు. ఎవరికైనా గాజులు వేయాల్సి వస్తే.... ఆ దుప్పటిని నేల మీద పరచి దాని మీద కూర్చొని గాజులు వేసేవాళ్లు. తమ సౌకర్యం కోసం... గాజుల వాళ్లు దుప్పటిని స్వయంగా తెచ్చుకోవడం మాట ఎలా ఉన్నా... కొందరకది వారికి వారు మర్యాద ఇచ్చుకోవడంగా కనిపించింది. ఇది నిజం కాకపోయినా.... ఎవరైనా తమను తామే గౌరవించుకునే సందర్భంలో .... 'గాజుల వారి మర్యాద' అనే మాట వినిపిస్తుంటుంది. |
ఆర్బత్ నాట్ క్షౌరం! | 'అట్లా ఇట్లా కాదు... ఆర్బత్ నాట్ క్షౌరం జరిగింది' 'ఆచి తూచి నిర్ణయాలు తీసుకోమని ఎన్నోసార్లు చెప్పాం. వింటాడా?ఇప్పుడు చూడు... ఆర్బత్ నాట్ క్షౌరం జరిగింది !' ఇలాంటి మాటలు వింటుంటాం. 'తిరుపతి క్షౌరం' అంటే ఏమిటో మనకు తెలుసు. మరి ఈ ఆర్బత్ నాట్ క్షౌరం ఏమిటి? ఒకప్పుడు... 'ఆర్బత్ నాట్' పేరుతో పెద్ద కంపెనీ ఉండేది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాఖలు ఉండేవి. "ఆర్బత్ నాట్' మీద నమ్మకంతో ..... ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే ఆస్తులను తెగనమ్మి మరీ పెట్టుబడులు పెట్టారట. అయితే ..... ప్రపంచ యుద్ధ సమయంలో ఈ కంపెనీ ఘోరంగా దివాలా తీయడంతో .... ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది కట్టుబట్టలతో మిగలాల్సి వచ్చింది. ఏదైనా నమ్మి.... పీకల్లోతు కష్టాల్లోనో, నష్టాల్లోనో మునిగిపోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. |
సాముకు చిన్న, చదువుకు పెద్ద | పాతకాలంలో పెద్దలు సాము నేర్చుకోవడానికి చిన్న వయస్సు బాగుంటదని లేత అవయవాలతో ఎట్టంటే అట్ల వంగవచ్చని భావించేవారు. ఆ కాలంలో చదువులు అందుబాటులో లేనందున చదువుకు పెద్ద వయస్సు అయినా ఫరవాలేదని చెప్పేవారు. ఆ సందర్భంగా 'సాముకు చిన్న, చదువుకు పెద్దని' ఈ జాతీయాన్ని వాడుతారు. |
“ఈడిగి మాటలు ఈడిమాకు దాటేవరకే" | తనున్న ప్రాంతంలో ఒకలా.. వేరే ప్రాంతానికి వెళ్తే మరోలా ప్రవర్తించే వారిని ఉద్దేశించి చెప్పిందే 'ఈడిగి మాటలు ఈడిమాకు దాటేవరకే' అనే సామెత. ఇక్కడ మాటలు అంటే గప్పాలు, ఎచ్చులు, వేషభాషలు అనే అర్థాలు వస్తాయి. ఈడిమాకు అంటే ఊరి పొలి మేర అన్నమాట. ఈ సామెత గీత కార్మికుల పదకోశం నుంచి జాలువారింది. ఎలా గంటే.... గీతకార్మికులు ఉదయం, సాయంత్రం ఊరి పొలిమేరల్లో ఉన్న తాటి, ఈత చెట్ల నుంచి కల్లును గీసేందుకు వెళ్తారు. ఈ క్రమంలో ఊరి పొలిమేర దాటగానే వారి వేషధారణ మారిపోతుంది. కులవృత్తికి తగ్గట్లుగా వస్త్రధారణ చేస్తారు. ఆ సామెత కాస్తా... ప్రాంతాన్ని, సందర్భాన్ని బట్టి మాటలు మార్చే వారికీ అన్వయించారు. |
'దున్నంగవోయి దులపంగ వచ్చిండట' | సోమరిపోతులు, బద్దకించే వారు, మాటలు చెప్పి పని తప్పించుకుపోయే వాళ్లను ఉద్దేశించి - చెప్పిందే ఈ 'దున్నంగవోయి దులపంగ వచ్చిండట' సామెత. ఎవరో చేసిన ఆ కష్టాన్ని అనుభవించడానికి ప్రయత్నించే వాళ్లకు కూడా వర్తిస్తుంది. ఈ తరహా వ్యక్తులు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు తోడు ఉంటారు. తీరా పని ప్రారంభంకాగానే తుర్రు మంటారు. ఆ పని కార్యరూపం దాల్చి, ప్రతిఫలం అనుభవించే సమయానికి మళ్లీ అక్కడ ప్రత్యక్షమవుతారు. ఈ సామెతలో దున్నంగ పోయి అంటే.. పొలం దుక్కి దున్నేటప్పుడు వెళ్లి, వడ్లు దులిపే సమయానికి రావడం. సోమరితనంతో శ్రమ చేయలేక ప్రతిఫలం కోసం వచ్చేస్తారు. అలాంటి వారికి చివాట్లు పెట్టే సందర్భంలో 'దున్నంగవోయి దులపంగ వచ్చిండు' అని ప్రయోగిస్తుంటారు. |
ఓరి నారలముల్లిగా.. | ఈ పదం సంభాషణ వాచకం కాదు. ఒక తిట్టు, వ్యంగ్యాస్త్రం, దూషణ, ఎత్తిపొడుపు. అన్నీ తెలిసి అమాయకత్వం నటించే వాళ్లను నారలముల్లి అంటారు. వీరికి విషయం అంతా తెలుసు.. అయినా ఏమీ తెలియనట్లే నటిస్తారు. కుట్రలు పన్నుతూ, అమాయకంగా నటిస్తూ తమకేం తెలియనట్లు, ఏం రానట్టు, ఏం లేనట్టు రక్తికట్టించడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య. 'అబ్బో ఏమీ ఎరగని మల్లన్న.. అక్కడ పుల్లలుపెట్టొచ్చి ఇక్కడ నారలముల్లిలాగ కూసున్నడు' వంటి పదాలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. |
ఈడొట్టి జీతనగండ్లోడు.. | ఈ పదబంధంలో జీతన అనే పదం.. ఆశకు సమానార్థం. జీతనగండ్లోడు అంటే కండ్లతో ఆశగా చూసేవాళ్లను అలా పిలుస్తారు. ఎవరైనా తింటున్నప్పుడు లేదా ఏదైనా పదార్థం అందరికంటే తనకు ఎక్కువ
మొత్తంలో కావాలనుకున్నప్పుడు.. ఆశగా ఎదురుచూస్తుంటే.. 'ఈడొట్టి జీతనగండ్లోడు. అన్నీ ఈడికే కావాలంటాడు' అని అంటారు. లేదా 'జీతులు ఇడుస్తున్నడు' అంటారు. జీతులు ఇడువడటమన్నా ఇదే అర్థాన్ని ఇస్తుంది.
|
పిలిచి పిల్లనిస్తే కులం లేదని లేచిపోయిండట! | కొన్నిసార్లు కొందరు వ్యక్తుల ప్రవర్తన మరీ విపరీతంగా ఉంటుంది. మనమే జాలిపడి వాళ్లను పిలిచి ఏదైనా ఇస్తామంటే అందులో లోపాలను వెతుకుతుంటారు. అది బాగలేదు.. ఇది బాగలేదు.. అంటూ వంకలు పెడుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి చెప్పే సామెతే 'పిలిచి పిల్లనిస్తే కులం లేదని లేచిపోయిండట' అనేది. ఇంకోరకం వ్యక్తులు కూడా ఉంటారు. వారికీ ఈ సామెత అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. వారు ఎలాంటివారంటే.. అవకాశాలు రాక ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. కొందరికి వద్దన్నా అవకాశాలు వచ్చిపడుతుంటాయి. అయితే వారు మాత్రం ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోగా, ..చిన్న చిన్న కారణాలు చెప్పి సమయం దుర్వినియోగం చేస్తుంటారు. పైగా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికి కూడా ఈ సామెతను అన్వయించవచ్చు. |
చారాణ కూరకు బారాణమసాలా?! |  అగ్గువకు వచ్చిన వస్తువును/ పదార్థాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు.. దానికంటే నాలు గైదు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే సందర్భంలో విరివిగా వాడే సామెతే 'చారాణ కూరకు బారాణ మసాలా ?!'. డబ్బును వృథాగా ఖర్చుచేసే వారినీ, తెలివి తక్కువ వాళ్లనూ గద్దించే సందర్భంలోనూ ప్రయోగిస్తారు. ఎనకటికి డబ్బుల్ని పైసల్లోనే ఎక్కువగా పలికేటోళ్లు. నయా పైసా.. ఐదు పైసలు.. పది పైసలు... ఇరువై అయిదు పైసలు (చారాణ)... యాభై పైసలు (ఆటాణ).. డెబ్బై ఐదు పైసలు (బారాణ).. నూరు పైసలు(ఒక్క రూపాయి)గా చెప్పేవాళ్లు. ఈ సామెతలో కూరకు అయ్యే ఖర్చు 20 పైసలు. కానీ, అందులో వేసే మసాలకు అయ్యే ఖర్చు మాత్రం 75 పైసలు. నాడు మన జానపదులు చెప్పిన ఈ సామెతకు నేటికీ ఆదరణ తగ్గలేదు. |
మొత్తం ఏడు సనుగులు.. |  'ఇగో.. మొత్తం ఏడు సనుగులు. ఐదు పిస్పీలు, రొండు సందూకులు... లెక్క పెట్టుకో. పొల్ల, పొల్లడు పైలం. కూర్కకు' అంటూ పండుగకు ఇంటికివచ్చి అత్తగారింటికి వెళ్తున్న కూతురితో ఓ తల్లి చెప్పిన పదబంధం ఇది.ఈ వాక్యంలో సనుగులు అంటే వస్తువులు. పిస్పి అంటే సంచులు. సందూకు అంటే పెట్టె. పొల్ల అంటే అమ్మాయి. పొల్లడు అంటే పిల్లవాడు. పైలం అంటే జాగ్రత్త. కూర్కకు అంటే నిద్రపోకు. ఇప్పుడు దీని వివరణ చూద్దాం... 'మొత్తం ఏడు వస్తువులు... వీటిల్లో ఐదు సంచులు, రెండు పెట్టెలు. పిల్లా, పిలగాడు జాగ్రత్త.. నిద్రపోకు అమ్మా' అని తల్లి తన బిడ్డకు జాగ్రత్తలు చెబుతున్నది. ఇలాంటి జీవం, బలం నిండిన మన పల్లెపదుల మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. |
ఆ అజ్జకారితో నెగుల్తవా?! |  'వాడొక అజ్జకారోడు.. వానితో ఏడ నెగుల్తవ్ రా', “అరేయ్ మళ్లీ జెప్తున్నా.. ఆ అజ్జకారీ యవ్వారమే వద్దంటున్న' అనే పదబంధాలు ఎప్పుడైనా విన్నారా? అజ్జకారి అంటే మాటకారి, గయ్యాళి టైపు. ఎవర్నీ మాట్లానివ్వకుండా తన మాటల్తో ఎదుటివాళ్ల దగ్గర గెలిచేవాళ్లను ఇలా అజ్జకారి అని అంటుంటారు పల్లెల్లో. పై పదబంధంలో 'నెగుల్తం' అంటే గెలువడం అని అర్థం. అత్తాకోడళ్ల గొడవల్లో అజ్జకారి, నెగుల్తవ్ అనే పదాలు బాగా వినిపిస్తుంటాయి. 'గయ్యాళి అత్త కాదు.. గదేడ నెగు లనిత్తది' అనే పదబంధంలో నెగలనియ్యక పోవడం అంటే గెలువనియ్యక పోవడం అని. |
అల్పునికి ఐశ్వర్యం | 'అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు' అని వేమన చెప్పాడు. అల్పునికి అధికారం మాత్రమే కాదు, ఐశ్వర్యం ప్రాప్తించినా ఇక పట్టపగ్గాలు ఉండవు. అవసరం ఉన్నా, లేకపోయినా అడుగడుగునా ఐశ్వర్య ప్రదర్శన చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి వారి ఐశ్వర్య ప్రదర్శన జనాలకు చిరాకు తెప్పిస్తుంది. ఒక్కోసారి వారి ప్రవర్తన నవ్వుల పాలవుతుంటుంది. వెనకటికి ఒక అల్పుడికి కాలం కలిసొచ్చి ఐశ్వర్యం దక్కిందట. ఇక అప్పటి నుంచి అతగాడి తీరుతెన్నులే మారిపోయాయి. వేష భాషల్లో డాబు దర్పం ఒలకబోస్తూ ఊరేగేవాడు. ఎక్కడకు వెళ్లినా ఒక సహాయకుడు అతడికి గొడుగు పడుతూ ఉండేవాడు. ఒకసారి అత్యవసరంగా అర్ధరాత్రి వేళ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా తన సహాయకుడితో గొడుగు పట్టించుకుని ఊళ్లోకి బయలుదేరాడట. |
సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు | పెద్దలు అనుభవసారంతో చెప్పిన మాటలే సామెతలు. ఎంత గంభీరోపన్యాసమైనా సందర్భోచితంగా సామెతలను ఉటంకించకపోతే శ్రోతలకు రుచించదు. చక్కని పదసంపద గలవారు తమ సంభాషణల్లోను, రాతల్లోనూ అలవోకగా సామెతలను ఉటంకిస్తూ జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. ఇక ఆమెత అంటే విందు. శుభాశుభ కార్యాలకు, పండుగ పర్వాలకు ఇళ్లలో విందులు జరగడం మామూలే. ఎప్పుడూ విందులేని ఇల్లు నిరుపేదవాని ఇల్లైనా కావాలి లేకుంటే పరమ లోభివాని ఇల్లైనా కావాలి. విందులేని ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో, సామెత లేని మాట కూడా అలాగే నిస్సారంగా ఉంటుంది. |
అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరణీ గోదానం | ప్రాణసంకట పరిస్థితుల్లో మీద పడే ఖర్చుకు అట్టే బాధపడకుండా ఎవరికి వారే నచ్చజెప్పుకొనేందుకు పుట్టిన జాతీయం ఇది. ఇదివరకటి కాలంలో రోగి చావు బతుకుల్లో ఉన్నప్పుడు వైద్యుడికి గోవును సమర్పించుకుంటే రోగం కుదిరి ప్రాణాపాయం తప్పుతుందని నమ్మేవారు. నమ్మకాలు ఎల్లవేళలా పనిచేయవు కదా! వైద్యుడికి గోవును ఇచ్చుకున్నప్పటికీ ఒక్కోసారి రోగి గుటుక్కుమనేవాడు. అదృష్టవశాత్తు వైద్యం పనిచేసి రోగికి నయమైతే వైద్యుడికి ఇచ్చిన గోవును వైద్యకట్నంగా సరిపెట్టుకునేవారు. అలా కాకుండా, రోగికి ఆయువు తీరి చనిపోతే, ఎలాగూ అంత్యక్రియల్లో చేయాల్సిన వైతరణీ గోదానాన్ని ముందుగానే చేసేసినట్లుగా భావించి ఊరట పొందేవారు. |
పొరుగూరి సేద్యం | సేద్యం అంటే... కష్టం ఎక్కువ... లాభం అతి తక్కువ. మన కష్టాన్ని నమ్ముకుంటేనే చాలదు. విధిని కూడా విధిగా నమ్ముకోవాలి. అన్నీ కలిసొస్తే రైతుకు కలిసొస్తుంది. అతడి కంట్లో వెలుగు నిండుతుంది. చేయూత ఇవ్వడానికైనా, మాట సాయానికైనా మన వాళ్లంటూ కొందరు ఉండాలి. మన వాళ్లంటూ కొందరు ఉన్నప్పటికీ... సేద్యం అనేది ముళ్ల మీద నడకైనప్పుడు... ఇక పొరుగూరిలో సేద్యం అనే వ్యవహారంలో ఎన్నెన్ని కష్టాలు ఉంటాయి! ఈ నేపథ్యంలో నుంచే... ‘పొరుగూరి సేద్యం తనను తినేదేగానీ... తాను తినేదికాదు' అనే సామెత పుట్టుకొచ్చింది. అయితే 'పొరుగూరి సేద్యం' అనే జాతీయాన్ని కేవలం వ్యవసాయం విషయంలోనే కాదు... 'ఫలానా పని కలిసిరాదు' 'ఫలానా పని చేయడం వల్ల వృథా’ 'ఫలానా పనిలో శ్రమ అధికం... ఫలితం శూన్యం'లాంటి విషయాల్లోనూ ఉపయోగిస్తుంటారు. |
పిల్లినడక | పిల్లి నడిస్తే చప్పుడు రాదు. అందుకే దాని రాకపోకలను కనిపెట్టడం కష్టం. ఏదో వస్తువు కింద పడితేగాని దాని ఉనికి అనేది తెలిసిరాదు. దొంగలు కూడా పిల్లినడకనే అనుసరిస్తారు. 'పిల్లినడక' అనేది 'ఎవరికీ అనుమానం రాకుండా’ అనే అర్థంలో కూడా వాడుతుంటారు. అమాయకంగా, నిశ్శబ్దంగా ఉంటూనో, ఎవరికి తెలియకుండా మోసం చేసే వ్యక్తిని...'పిల్లి నడక నడిచే వ్యక్తి' అంటుంటారు. |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
| |
No comments:
Post a Comment