Pages

నీచాశ్రయో న కర్తవ్యః - బాలనీతి పద్యం - అర్థం

నీచాశ్రయో న కర్తవ్యః - బాలనీతి పద్యం - అర్థం 

నీచాశ్రయో న కర్తవ్యః

కర్తవ్యో మహదాశ్రయః /

ఈశాశ్రయో మహానాగః

పప్రచ్ఛ గరుడం సుఖమ్ //

అర్థము: ఒక వ్యక్తి తనకు తానుగా అన్ని సందర్భాల్లోనూ ఏ విధమైన చిక్కులూ, అలజడులూ లేకుండా జీవించలేడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తనకంటే గొప్పవాడైన మరొక వ్యక్తిని ఆశ్రయించి అతని సహాయంతో కష్టాల నుండి గట్టెక్కుతాడు. ఇది లోకస్థితి. 

                                            అలా మరొక వ్యక్తిని ఆశ్రయించవలసి వచ్చినప్పుడు మహనీయుడైన గొప్పవాణ్ణి ఆశ్రయించాలే కాని నీచుణ్ని ఆశ్రయించరాదు అని భావము. 

                                  ఉదాహరణకు అది ఒక కొండ అనుకుందాము. ఆ కొండ మీద ఒక సర్పం ఉన్నది. ఒకనాడు అది ఆ పర్వతం మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది. ఇంతలో ఆకాశంలో పయనిస్తూ గరుడుడు ఆ పామును సమీపించాడు. 

                                 అలాంటి స్థితిలో మామూలు పాము అయితే, ఆత్మ రక్షణకై ఏ కలుగులోనో (రంధ్రం లోనో) దూరడానికి ప్రయత్నించి ఉండేది. కానీ, ఆ పాము అలా చేయలేదు.  పైగా, గరుడుణ్ణి  చూసి,' ఏమి మిత్రమా! కుశలమా?' అని అడిగింది. గరుడుడు కూడా 'ఆఁ ! కుశలమే! నీకూ క్షేమమే కదా?' అని ప్రతి ప్రశ్న వేశాడు. 

                                            ఇద్దరూ ఇలా పరస్పరం ప్రశ్నించుకొని నవ్వుకుంటూ తమ దారిన తాము వెళ్లారు. ఇది ఎలా జరిగింది అని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు. అసలు సంగతి ఏమిటంటే -

ఆ కొండ కైలాసం. 

ఆ సర్పం శివుని మెడలో ఆభరణమైన మాల. 

ఆ దినం విహారానికై అది గరుడుని కంటబడింది. మహా మహుడైన శివుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆ సర్పానికి గరుడుడు ఏ విధమైన హానీ కల్గించలేకపోయాడు. 

                                             కాబట్టి, మహాత్ములను ఆశ్రయించాలే కాని, నీచులను ఆశ్రయించరాదు అని ఈ నీతిశ్లోకం బోధిస్తున్నది.                                       


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు