Pages

Annamacharya Keerthana - Konaro Konaro Miru Kurimimandu

అన్నమాచార్య కీర్తన - కొనరో కొనరో మీరు కూరిమిమందు  
కొనరో కొనరో మీరు కూరిమిమందు 
ఉనికి మనికి కెల్ల నొక్కటే మందు 

ధ్రువుడు  గొనినమందు తొల్లియుఁ బ్రహ్లాదుడు 
చవిగాఁ గొనిన మందు చల్లని మందు 
భవరోగములు వీడి పారఁగ బెద్దలు మున్ను 
జవకట్టికొనిన నిచ్చలమైన మందు 

నిలిచి నారదుఁడు గొనినమందు జనకుఁడు 
గెలుపుతో గొని బ్రతికిన యా మందు 
మొలచి నాలుగుయుగముల రాజులు ఘనులు 
కలకాలముగొని కడగన్న మందు 

అజునకుఁ బరమాయువై యెసఁగిన మందు 
నిజమై లోకములెల్ల నిండిన మందు 
త్రిజగములు నెఱుఁగఁ తిరువేంకటాద్రిపై 
ధ్వజమెత్తె గోనేటి దరినున్న మందు                     (సంపుటం - 01, సంకీర్తన - 237)

అర్థము : బ్రహమదేవుడు భగవంతుడినే పరమౌషధం పరమాయువై విలసిల్లినది. ఇదే సత్యస్వరూపమై భువనములెల్ల నిండియున్నది. ఇది ఎట్టి ఉద్వేగాన్ని కల్గించని చల్లని మందు. స్వామి పుష్కరిణి గట్టుననున్న ఈ మందే ముల్లోకాలకు "నాలాగా పరిమార్పగలిగే మందు ఇంకొక్కటి లే" దని  శ్రీవేంకటాద్రిపై రథమెక్కి చాటినది. 

                                   సంసారరోగాల్ని పోగొట్టుకోవడానికై ఈ ఔషధాన్నే పూర్వం స్వామి పరమభక్తులు నారదుడు, జనకుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు మిక్కిలి ప్రీతితో స్వీకరించారు. నాలుగు యుగాలకు చెందిన నరపతులు, మహాత్ములు ఈ మందునే సేవించి ముక్తులయ్యారు. 

                                   కాబట్టి ఓ జనులారా! ప్రేమస్వరూపుడైన భగవంతుడనే పరమౌషధాన్ని మీరూ స్వీకరించండి. లోకంలో సుఖంగా జీవించటానికి ఇదొక్కటే శరణాగతి మందు అంటూ అన్నమయ్య ఈ సంకీర్తనలో ఉద్భోదిస్తున్నాడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు