Pages

అన్నమయ్య కీర్తన - నీవు పరిపూర్ణుడవు స్వామీ!

 అన్నమయ్య కీర్తన - నీవు పరిపూర్ణుడవు స్వామీ! 

నే నేమిఁ జేయగలేను నీవు పరిపూర్ణుఁడవు 
హీనుఁడ నే నధికుడ వన్నిటా||

దండము పెట్టుట నాది తప్పు లోఁగొనుట నీది
నిండి నీ వెప్పుడు దయానిధివి గాన,
అండఁ జేరుకొంట నాది అందుకు నూఁ కొంట నీది
దండియైన దేవ దేవోత్తముఁడవు గాన | (1)

శరణు చొచ్చుట నాది సరుగఁ గాచుట నీది 
పరమ పురుష శ్రీపతివి నీవు
విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది 
పొరి నీవు భక్త సులభుఁడ వటు గాన || (2) 

దాసుఁడ ననుట నాది తప్పక యేలుట నీది
ఆసదీర్చె వరదుఁడ వటుగాన
నీ సేవ యొక్కటి నాది నిచ్చలు గై కొంట నీది 
యీసులేని శ్రీవేంకటేశుఁడవు గాన॥ (3) 
                                            (అధ్యాత్మ సంకీర్తన- 2-433 )
అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో 'జీవుని' సేవకత్వమును, 'దేవుని' రక్షకత్వమును విశదపరుస్తున్నారు.
       'స్వామీ! నేను అల్పుడను. నీవు పరిపూర్ణస్వరూపుడవు. ఎట్టి శక్తిలేని నేను హీనుడైన జీవాత్ముణ్ణి. నీవు అన్ని విధాల గొప్పవాడవైన పరమాత్ముడవు. నీకు నమస్కరించుట నా పని. నా తప్పులు సరిదిద్ది క్షమించుట నీ పని. ఎందుకంటే, నీవు పరిపూర్ణుడైన కరుణానిధివి కదా! నీ నామములు అనగా పేర్లు పేర్కొనుటయే నా పని. పలుకుట నీ పని. నిన్ను శరణు వేడుట నా కర్తవ్యం. రక్షించడం నీ కర్తవ్యం. ఎందుకంటే నీవు శరణాగత తత్పరుడవు. పూలతో పూజించుట నా వంతు. నాకు వివిధ సంపదలనివ్వడం నీ పని. ఎందుకంటే నీవు భక్తసులభుడవు కదా! 
           నేను నీ దాసుడవటం నా కర్తవ్యం. నా పై దయ జూపి కాపాడడం నీ కర్తవ్యం. ఎందుకంటే దాసుల ఆశలు తీర్చే వాడివి కదా! ఈ విధంగా మిమ్మల్ని  సదా సేవించుటయే నా పని. నా సేవలను ఎప్పుడూ అంగీకరించడమే నీ పని. ఎందుకంటే నీవు ఈర్ష్య లేని వాడవు కదా!' అని అన్నమయ్య కీర్తిస్తున్నారు. 



No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు