Pages

మానసబోధ 46 - 55

మానసబోధ 46 - 55
46. ఓంకార మంత్రమును 
     శ్రద్ధతో భక్తితో 
     జపము చేయుము ఓయి మనసా 
           ప్రణవజపము చేత 
          పాపరాశంతయు 
         భస్మమై పోవునూ మనసా 

47. ప్రాణులన్నిటిలోన 
      పరమాత్మ సమముగా 
      వ్యాపించియున్నాడు మనసా 
         దైవదృష్టిచె నీవు 
         ఎల్లప్రాణులయందు 
         దయగల్గి యుండుమూ మనసా 

48. ప్రతిజీవి దేహంబు 
      పరమాత్మ నివసించు 
      స్థానమే యగును ఓ మనసా 
         సద్గుణాలను నట్టి 
       పుష్పాలచే నీవు 
       పూజించు ఆత్మనూ మనసా 

49. భువిలోన జీవుని
     ధనకీర్తు లెవ్వియు
     రక్షించజాలవూ మనసా
        సత్యధర్మములు రెండు
      ఎల్లకాలములందు
     కడతేర్చు జీవుని మనసా

50. చిత్తమందేవైన
     దోషాలు దొరలినా
     తొలగించి వేయుమూ మనసా
        దోషరహితంబైన
        చిత్తంబె ముక్తికి
        అనువైన క్షేత్రమూ మనసా

51. మితమైన హితమైన
      ఆహార సేవనచె
      ఆరోగ్యమే బడయు మనసా
           అధ్యాత్మ రంగమున
          ఆరోగ్యమే మొదటి
          అవసరంబగు నోయి మనసా

52. దేహమే యొక నావ
      జీవు డద్దానిని
     నడుపుచుండును ఓయి మనసా
       నావ బాగున్నపుడె
      సంసార సాగరము
    దాటి వేయుము ఓయి మనసా

53. భువిలోన జీవుడు
     మోక్షంబు నొందుటకు
     గీత బోధయే చాలు మనసా
        గీతతత్వము నెల్ల
      క్షుణ్ణముగ తెలిసికొని
     భవసాగరము దాటు మనసా

54. దానధర్మములు చేసి
       పేదలను రక్షించి
       పుణ్యమును బడయుమూ మనసా
         పుణ్యమే ధనమని
         భావించి శీఘ్రముగ
         అద్దాని నార్జించు మనసా

55. ఇటునటు పరుగెత్తు
      ఇంద్రియంబుల నెల్ల
     అదుపులో నుంచుమూ మనసా
        అదుపు తప్పిన గుఱ్ఱాలు
        బండిని పడవైచు
        జాగరూకత నొందు మనసా 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు