Pages

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 3

    వేమన పద్యరత్నాకరము -  నక్క వినయములను నైగారములు బల్కి 

నక్క వినయములను నైగారములు బల్కి 
కుడవకెల్ల ధనము కూడబెట్టు 
కుక్కబోను వాత కూడు చల్లిన రీతి 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: నక్క వినయాలను నటిస్తూ ఇచ్చకాలు పలుకుతూ డబ్బుని అనుభవించక అదేపనిగా కూడబెడుతుంటాడు. అది ఎలాంటిదంటే కుక్కబోను ముందు కూటిని జల్లడం లాంటిది.

 వేమన పద్యరత్నాకరము -  వెళ్ళివచ్చునాడు మళ్ళిపొయ్యేనాడు 

వెళ్ళివచ్చునాడు మళ్ళిపొయ్యేనాడు 
వెంటరాదు ధనము కొంచ బోడు 
తాను యేడబోవు? ధనమేడబోవునో? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  ఎవడూ ధనాన్ని తెచ్చుకుని లోకంలోకి రావడం లేదు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు పట్టుకొని పోలేడు. మరణించిన తరువాత ధనం దారి ధనముది. తన దారి తనది.

వేమన పద్యరత్నాకరము -  పుట్టుబిత్తలివలె పోవు బిత్తలివలె 

పుట్టుబిత్తలివలె పోవు బిత్తలివలె 
తిరుగు బిత్తలివలె దేహి ధరణి 
యున్నవాటికైన నుపకారి గాలేడు 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: జనుడు దిగంబరంగా పుడుతున్నాడు. అట్లే మరణిస్తున్నాడు. వ్యామోహాదులన్నింటినీ విడిచి వాడు ఓ మునిగా దిగంబరుడై భూమ్మీద సంచరిస్తున్నాడు.

వేమన పద్యరత్నాకరము -  కాశి బోదు ననుచు కడ కట్టగానేల? 

కాశి బోదు ననుచు కడ కట్టగానేల? 
వాశి తీర్థములను వగవనేల? 
దోసకారికెట్లు దొరకురా యా కాశి? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: కాశీకి వెడుతున్నానంటూ వట్టి డంబాలు కొడతారు కొందరు. చివరకా పుణ్య తీర్థాలను దర్శించలేక విచారిస్తూంటారు. దుష్ట బుద్దులకు కాశీ సులభంగా లభించదు. పుణ్య ఉంటేనే కాశీ వెళ్ళగలరు.

వేమన పద్యరత్నాకరము -  ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు  

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు 
కాచి యతక నేర్చు కమ్మరీడు 
మనసు విరిగెనేని మరి యంట నేర్చునా? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: ఇనుపముక్క విరిగితే దాన్ని తీవ్రంగా కాల్చి రెండుసార్లయినా మూడు సార్లయినా అతకవచ్చు. మనస్సు విరిగితే మాత్రం అతకడం చాలా కష్టం.

1 comment:

  1. దుమ్ము పర్యాయపదాలు చెప్పండి

    ReplyDelete

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు