Pages

మానసబోధ 15 - 25

మానసబోధ 16 - 25
16. బలహీనుడను నేను
     అని తలంచుచు నీవు
    పరితపించెదవేల మనసా
          శక్తులన్నియు నీలోనే
          కలవంచు భావించి
         ధైర్యమును చేబట్టు మనసా

17. జన్మంబు లన్నిటిలో
      నరజన్మ శ్రేష్ఠమని
     చక్కగా నెరుగుము మనసా
        దైవభావము గలిగి
       మనుజత్వ మంతను
      సార్థకంబుగ జేయి మనసా

18. శాస్త్రాల సారము
      వివరించి తెలిపెద
     శ్రద్ధగా వినుము ఓ మనసా
        పరహితమె పుణ్యము
       పరపీడ పాపము
       దయచూపు ఎల్లెడల మనసా

19. మార్గంబు లన్నిటిలో
      భక్తిమార్గమె చాల
     సులభమైనది ఓయి మనసా  
          శ్రద్ధతో శుద్ధితో
         భక్తిమార్గమును బట్టి
       గమ్యాన్ని చేరుకో మనసా

20. పెక్కు జన్మల నుండి
      విషయ సంస్కారాలు
      వెంటాడుచున్నవీ మనసా
         అభ్యాస బలముచే
        వానినెల్లను నీవు
        పోగొట్టుకో ఓయి మనసా

21. వ్యవహారమందున
      మునిగియున్నను నీవు
      దైవాన్ని మరువకూ మనసా  
         దైవచింతన యొకటె
        నిక్కముగ భువిలోన
        కడతేర్చు సాధనము మనసా

22.  ధ్యానమందున నీవు
      చిత్తమును ఇటు నటూ
       పరుగెత్తనీయకూ మనసా
          నిశ్చలంబై నట్టి
          చిత్తంబు లోపల
         ఆనంద ముదయించు మనసా

23. తోటి ప్రాణిని నీవు
      నీవలె చూచుచు
      మెలగుచుండుము ఓయి మనసా
         నీ సౌఖ్యమును వోలె
         పరసుఖంబును గూడ
        కాంక్షించు చుండుమూ మనసా

24. కష్టాలు కలిగినా
      నష్టాలు కలిగినా
      శాంతంబు వీడకూ మనసా
          నిర్వికారత్వము
         సహన శీలత్వము
        అభ్యసింపుము ఓయి మనసా

25. బంధరూపములైన
      కోపతాపాలను
     దరికి చేర్చకు ఓయి మనసా  
         కోపాన్ని అరికట్టి
         కామాన్ని తెగద్రుంచి
        మోక్షధామము చేరు మనసా 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు