మానసబోధ 66 - 75
66. ఎల్ల వస్తువులందు
కాలంబు ఒకటియె
విలువైనదే యగును మనసా
విలువైన కాలాన్ని
విషయభోగములందు
వ్యర్థంబు చేయకూ మనసా
67. కర్మచే జన్మము
కర్మచే బంధము
కలిగితీరును ఓయి మనసా
జ్ఞానాగ్నిచే కర్మ
భస్మంబు అయినచో
భవబంధములు తొలగు మనసా
68. అవతారమూర్తి యగు
కృష్ణుండు చెప్పిన
గీత ఒక్కటి చాలు మనసా
గీత భావన చేత
గీత గానము చేత
శాంతి సుఖములు కలుగు మనసా
69. ఆత్మావలోకనము
అతి ముఖ్యమైనదని
భావించి నీ వెపుడు మనసా
ధాన్యాదులందును
జ్ఞానార్జనందును
కాలంబు గడుపుమూ మనసా
70. ఆత్మలో విశ్వము
కల్పింపబడియుండి
తోచుచున్నది ఇట్లు మనసా
లేనిదే అయినట్టి
జగతియందున నీకు
ఆసక్తి యేలకో మనసా
71. వేదశాస్త్రాలను
శ్రద్ధతో నీ వెపుడు
మనసంబు చేయుము మనసా
మననాది క్రియలచే
బుద్ధి తానంతట
శుద్ధమై పోవునూ మనసా
72. జీవుని కడతేర్చు
దేవదేవుని నీవు
ఆశ్రయించుము ఓయి మనసా
దైవభక్తిచె ఎల్లపుడు
శాశ్వతంబగు ముక్తి
కలిగితీరును ఓయి మనసా
73. దేహదృష్టిని వదలి
ఆత్మదృష్టిని పెంచి
ఆనందమొందుమూ మనసా
అభిమానమును త్రెంచి
మమకారమును త్రుంచి
మోక్షధామము చేరు మనసా
74. సత్పాత్రులకు చేయు
దానధర్మాలచే
పుణ్యంబు చేకూరు మనసా
పుణ్యముచె జ్ఞానంబు
జ్ఞానముచె మోక్షంబు
కలిగితీరును ఓయి మనసా
75. కామక్రోధాలను
దంభదర్పాలను
దరికి చేర్చకు ఓయి మనసా
కలుషరూపాలగు
కామక్రోధాలచె
హృదయంబు చెడిపోవు మనసా
No comments:
Post a Comment