మానసబోధ 76 - 85
76. నారాయణా యనుచు
హరినామమును నీవు
భక్తితో పలుకుమూ మనసా
హరినామ స్మరణచే
దురితంబు తొలగును
చిత్తశుద్ధియు కలుగు మనసా
77. జడమైన దేహము
ఏ కాలమందును
నీ స్వరూపము కాదు మనసా
దేహాన్ని చూచేటి
సాక్షివే నీ వని
ఎల్లపుడు చింతించు మనసా
78. ఇలలోన సకలము
ఏనాటికైనను
నాశమై పోవునూ మనసా
నాశంబు లేనట్టి
పరమాత్మనే నీవు
ఆశ్రయించుము ఓయి మనసా
79. క్షేత్రంబునే గాదు
క్షేత్రజ్ఞుడను నేను
అని తలంచుము నీవు మనసా
దృశ్యమును నే గాడు
దృగ్రూపమే అనుచు
ఎలుగెత్తి చాటుమూ మనసా
80. సంసార దుఃఖమును
అంతమొందించెడు
ఆత్మవిద్యను బడయు మనసా
తత్త్వంబు తెలిసికొని
చింత లెవ్వియు లేక
హాయిగా నుండుమూ మనసా
81. ఇల్లు బాగున్నను
వళ్లు బాగున్నను
ధనము బాగున్నను మనసా
హరిపాదముల యెడల
భక్తియే లేనిచో
సర్వమూ వ్యర్థమే మనసా
82. వెన్నవలె హృదయాన్ని
కోమలంబుగ నీవు
చేసివైచుము ఓయి మనసా
నవనీత ప్రియుండ
అత్తఱ్ఱి హృదయాన
తిష్ఠవేయును ఓయి మనసా
83. వైరమును వదిలేసి
ప్రేమభావము పెంచి
దయగల్గి యుండుమూ మనసా
దయయున్న హృదయమే
దైవవాసంబని
త్వరితముగ తెలిసికో మనసా
84. తోలుతిత్తివి నీవు
కాదంచు వేదాలు
ఘోషించు చున్నవీ మనసా
దేహాభిమానంబు
వదిలేసి శీఘ్రముగ
ఆత్మవై చెన్నొందు మనసా
85. చెడ్డ భావాలకు
మంచి భావాలకు
జరుగుచున్నది పోరు మనసా
యత్నాతిశయముచే
చెడ్డ భావాలపై
విజయంబు చేబట్టు మనసా
మంచి భావాలకు
జరుగుచున్నది పోరు మనసా
యత్నాతిశయముచే
చెడ్డ భావాలపై
విజయంబు చేబట్టు మనసా
No comments:
Post a Comment