మానసబోధ 96 - 108
96. మురికి కొంపగ పేరు
పొందిన దేహంబు
నీ వెట్లు అగుదువూ మనసా
అతి నిర్మలంబైన
ఆత్మయే నీవని
దృఢముగా నమ్ముమూ మనసా
97. సంసార విషయాలు
సేవించి సేవించి
విసుకెత్తదే నీకు మనసా
ఆత్మానుభూతి యను
అపురూప కార్యంబు
సాధించుమూ ఓయి మనసా
98. మరణించు సమయాన
బంధ్వాదు లెవ్వరూ
వెంబడించరు నిన్ను మనసా
నీవు చేసిన కర్మయె
నీ వెంట వచ్చునని
బాగుగా తెలిసికో మనసా
99. పుట్టింది యేలకో
బాగుగా యోచించి
కార్యంబు సలుపుమూ మనసా
పుట్టుకే లేనట్టి
ఆత్మ పదమును పొందు
మార్గాన్ని తెలిసికో మనసా
100. ఎందరో రాజులు
పుట్టిరీ గిట్టిరీ
పేరైన యున్నదా మనసా
భువిలోన మానవులు
సంపత్తు లన్నియు
బుడగవంటివి ఓయి మనసా
101. ప్రతిబింబ సుఖములు
ఎంత గొప్పవి అయిన
సంతుష్టి నొసగవూ మనసా
బింబ సౌఖ్యానికై
హృదయంబు లోపల
బాగుగా వెతుకుమూ మనసా
102. కొండంత ఆశతో
విషయాల నన్నిటిని
అనుభవింపగనేల మనసా
విషయ సౌఖ్యాలన్ని
దుఃఖాలుగా మారి
బాధించు శీఘ్రమే మనసా
103. భువిలోన సర్వత్ర
ఒక్క ప్రాణినినైన
బాధించకూ ఓయి మనసా
నిన్ను నీ వెప్పుడు
ప్రేమించులాగున
దయజూపు అంతటా మనసా
104. చిత్తమెల్లపుడును
విషయాల మీదికి
పరుగెత్తుచుండునూ మనసా
దేనిపై వ్రాలునో
జాగరూకుండవై
సాక్షిగా గమనించు మనసా
105. మితమైన హితమైన
ఆహారమును నీవు
సేవించుమూ ఓయి మనసా
మోక్షసాధనలందు
ఆహార నియమము
అతి ముఖ్యమైనదీ మనసా
106.'ఆత్మయే నేన' నుచు
మదిలోన ఎల్లపుడు
భావించుచుండుమూ మనసా
ఆత్మ చింతనచేత
శక్తి సామర్థ్యములు
బాగుగా కలుగునూ మనసా
107. వేదాలసారము
ఒక్కమాటలో నీవు
ఆలకింపుము ఓయి మనసా
బ్రహ్మమే సత్యము
జగము సత్యము కాదు
జీవుండు బ్రహ్మమే మనసా
108. శాస్త్రసారము నిట్లు
బాగుగా తెలిసికొని
ఆచరింపుము ఓయి మనసా
ధరణి విద్యాప్రకాశుని
మాట గైకొని
శ్రద్ధగా నడుపుమూ మనసా
No comments:
Post a Comment