Pages

తెలుగు వ్యాకరణము - రెండవ ప్రకరణము - వర్ణములు

తెలుగు వ్యాకరణము - రెండవ  ప్రకరణము - వర్ణములు 
వర్ణమనగా నేమి?
సమాధానం: ఒక్కమారుగా ఉచ్చరించుటకు వీలైన ధ్వనిని వర్ణము అందురు.
ఉదా: అ - అనునది ఒక వర్ణము.
         క - అనునది క్, అ - అను రెండు వర్ణములు. 
అక్షరమనగా నేమి?సమాధానం: ఒక్కమారుగా ఉచ్చరించుటకు వీలైన వర్ణ సముదాయమును అక్షరమందురు.
ఉదా: స్త్రీ - అనునది ఒక అక్షరం. ఇది స్, త్, ర్, ఈ - అను 4 వర్ణముల సముదాయము.
         క - అనునది ఒక అక్షరము. ఇది క్ - అ - అను రెండు వర్ణముల సముదాయము.
                  కాని, వర్ణమునకు, అక్షరమునకు ఇంత భేదమున్నప్పటికిని స్థూల దృష్టితో రెండును సమానార్థకములుగానే గ్రహింపబడుచున్నవి. 
వర్ణ సమామ్నాయము 
వర్ణ సమామ్నాయము అనగా నేమి?సమాధానం: వర్ణముల సమూహమును వర్ణ సమామ్నాయము అందురు. 
ఆంధ్ర వర్ణములు ఎన్ని? అవి ఏవి?
సమాధానం: ఆంధ్ర వర్ణములు 56. అవి :
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ (అం అః)
క ఖ గ ఘ ఙ  - క - వర్గము
చ ఛ జ ఝ ఞ - చ - వర్గము
ట ఠ డ ఢ ణ - ట -  వర్గము 
త థ ద ధ న - త -  వర్గము 
ప ఫ బ భ మ - ప -  వర్గము 
య ర ఱ ల ళ వ శ ష స హ  
వర్ణ విభాగము 
ఆంధ్ర వర్ణములు ఎన్ని విధములుగా విభజించవచ్చును? అవి ఏవి?సమాధానం: ఆంధ్ర వర్ణములును 3 విధములుగా విభజించవచ్చును.
అవి: 1.  అచ్చులు  2. హల్లులు        3. ఉభయాక్షరములు 
అచ్చులు ఎన్ని? అవి ఏవి?సమాధానం: అచ్చులు 16. అవి,
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡఎ ఏ ఐ ఒ ఓ ఔ 
అచ్చులకు గల ఇతర పేర్లేమి? అవి ఎట్లు వచ్చినవి?సమాధానం:  అచ్చులకు "ప్రాణములు, స్వరము"లని పేర్లు కలవు. హల్లుల పలుకుబడికి ప్రాణము వంటివి అగుట వలన "ప్రాణము"లనియు, స్వతంత్రమైన ఉచ్ఛారణ కలిగియుండుట వలన "స్వరము" లనియు అచ్చులకు పేర్లు వచ్చినవి. 
అచ్చులు ఎన్ని రకములు? అవి ఏవి? వివరింపుము?సమాధానం:   అచ్చులు రెండు రకములు. అవి -
1. హ్రస్వములు               2. దీర్ఘములు
1. హ్రస్వములు: ఒక్క మాత్ర (ఒక రెప్పపాటు) కాలములో ఉచ్చరింపబడు అచ్చులను " హ్రస్వములు" అందురు.
అవి 7 : అ  ఇ ఉ ఋ  ఎ ఐ ఒ
2. దీర్ఘములు : రెండు మాత్రల కాలములో ఉచ్చరింపబడు అచ్చులను " దీర్ఘములుఅందురు.
అ వి 9 :  ఆ  ఈ  ఊ  ౠ  ౡ ఏ ఐ  ఓ ఔ 
వక్రములు అనగా నేమి?సమాధానం: వంకరగా ఉండు అచ్చులను "వక్రములు" అందురు. అవి (4) : ఎ - ఏ - ఒ - ఓ 
వక్రతమములు అనగా నేమి? అవి ఏవి?
సమాధానం: మిక్కిలి వంకరగా ఉండు అచ్చులను "వక్రతమములు" అందురు. అవి (2) : ఐ - ఔ. 
ప్లుతములనగా నేమి? అవి ఏవి?సమాధానం: మూడు మాత్రల కాలములో ఉచ్చరింపబడు అచ్చులను "ప్లుతములు" అందురు. అవి (2) : ఐ - ఔ. 
ఉభయాక్షరములెన్ని? అవి ఏవి? వాటికా పేర్లు ఎట్లు వచ్చెను?
సమాధానము: ఉభయాక్షరములు 3.
అవి: 1. సున్న (పూర్ణబిందువు)
          2. అరసున్న (అర్థబిందువు - ఖండబిందువు)
           3. విసర్గ
                         అచ్చుల మీద అచ్చు నిలువదు. కావున ఇక్కడ ఇవి అచ్చుల ధర్మము కల్గి యుండును. అచ్చుల సాయము లేనిదే ఇవి ఉచ్చరింపబడవు. కావున ఇక్కడ హల్లుల ధర్మము కలిగి యుండును. ఇట్లు అచ్చుల ధర్మమును, హల్లుల ధర్మమును కలిగి అచ్చులలోను, హల్లులలోను పరిగణింపబడుట వలన వీనికి ఉభయాక్షరములని పేరు వచ్చినది. 
ప్రశ్న: సున్నకు గల ఇతర పేర్లు ఏమిటి?
సమాధానము: సున్నకు - పూర్ణబిందువు, పూర్ణానుస్వారము, నిండు సున్న నిడుద బొట్టు అను పేర్లు కలవు. 
ప్రశ్న: అరసున్న కు గల ఇతర పేర్లు ఏమిటి?
సమాధానము: అరసున్నకు - అర్థబిందువు, అర్థానుస్వారము, ఖండ బిందువు, కురుచబొట్టు అను పేర్లు కలవు. 
ప్రశ్న: అనుస్వారమనగా  నేమి?
సమాధానము: అనుస్వారమనగా మరియొక వర్ణముతో చేర్చి ఉచ్చరింపబడునది. 
ప్రశ్న: విసర్గమనగా నేమి?
సమాధానము: విసర్గమనగా విడువబడునది. 
ప్రశ్న: హల్లులెన్ని? అవిఏవి?
సమాధానము: హల్లులు 37. అవి:
క - ఖ - గ - ఘ - ఙ - చ - ౘ - ఛ - జ - ౙ - ఝ - ఞ - ట - ఠ - డ - ఢ - ణ -  త -  థ -  ద -  ధ -  న - ప - ఫ -  బ -  భ - మ - య - ర -  ఱ -  ల -  ళ - వ - శ  - ష - స - హ
ప్రశ్న: హల్లులకు గల ఇతర పేర్లు ఏమి? వాటికా పేర్లు ఎట్లు వచ్చినవి?
సమాధానము: హల్లులకు ప్రాణులు - వ్యంజనములు అని పేర్లు కలవు. అన్యముల (అచ్చుల) సాయమున పలుకబడుట వలన హల్లులకు వ్యంజనములని పేరు వచ్చినది.
            ప్రాణములైన అచ్చులను పొందుట వలన హల్లులకు ప్రాణులని పేరు వచ్చినది. 
ప్రశ్న: హల్లులు ప్రధానముగా ఎన్ని రకములు?అవి ఏవి?
సమాధానము: హల్లులు ప్రధానముగా 3 రకములు. అవి:-
1. పరుషములు 2. సరళములు 3. స్థిరములు 
ప్రశ్న: పరుషములు అనగా నేమి? అవిఏవి?
సమాధానము: పరుషముగా పలుకబడునవి పరుషములు.
అవి: - క - చ - ౘ - ట - త - ప లు. 
ప్రశ్న: సరళములు  అనగా నేమి? అవిఏవి?
సమాధానము: సరళముగా పలుకబడునవి సరళములు. అవి:-
గ - జ - ౙ - డ - ద - బ లు. 
ప్రశ్న: స్థిరములు   అనగా నేమి? వాటికా పేర్లు ఎట్లు వచ్చెను?
సమాధానము: పరుష, సరళములు గాక మిగిలిన హల్లులను స్థిరములు అందురు. వ్యాకరణ కార్యములు జరుగునప్పుడు ఇవి స్థిరముగా నుండుట వలన వీనికి స్థిరములని పేరు వచ్చినది.
స్థిరములు 25. అవి: - ఖ - ఘ - ఙ - ఛ - ఝ - ఞ -  ఠ -  ఢ - ణ -  థ -  ధ -  న - ఫ -  భ - మ - య - ర -  ఱ -  ల -  ళ - వ - శ  - ష - స - హ
ప్రశ్న: స్పర్శములనగా నేమి? వాటికా పేర్లు ఎట్లు వచ్చెను?
సమాధానము: క - నుండి మ - వరకు గల ఇరువదియేడు (27) వర్ణములను స్పర్శములందురు. ధృఢమైన స్పర్శము కలవగుట వలన వీటికి స్పర్శములని పేరు వచ్చినది.
స్పర్శములు ఐదు (5) వర్గములుగా విభజింపబడినవి. అవి:-
క - వర్గము - క - ఖ - గ - ఘ - ఙ
చ - వర్గము - చ - ఛ - జ -  ఝ - ఞ
ట  - వర్గము - ట - ఠ - డ - ఢ - ణ
త  - వర్గము - త -  థ -  ద -  ధ - 
ప  - వర్గము - ప - ఫ -  బ -  భ - మ 
ప్రశ్న: వర్గయుక్కులనగా నేమి? వాటికా పేర్లు ఎట్లు వచ్చెను?
సమాధానము: వర్గ ద్వితీయ - చతుర్దాక్షరములను వర్గయుక్కులందురు. వర్గయుక్కులు పది (10). అవి: -
ఖ - ఘ -  ఛ - ఝ -  ఠ -  ఢ - థ -  ధ -  ఫ -  భ 
ప్రశ్న: అనునాసికములనగా నేమి? వాటికా పేర్లు ఎట్లు వచ్చెను?
సమాధానము: వర్గములందలి చివరి వర్ణములైన ఙ - ఞ - ణ - న - మ అను ఐదింటిని అనునాసికములందురు. ఇవి నాసిక (ముక్కు) సాయమున పలుకబడుటచే వీటికి అనునాసికములని పేరు వచ్చినది. 
ప్రశ్న: అంతస్థములనగా నేమి? వాటికా పేర్లు ఎట్లు వచ్చెను?
సమాధానము: య - ర - ఱ - ల - ళ - వ అను ఆరు(6) వర్ణములను అంతస్థములందురు. "అంతస్థము" అనగా మధ్యనుండునది. ఊష్మములకు స్పర్శములకును మధ్యనుండుటచే వీటికి పేరు వచ్చినది. 
ప్రశ్న: ఊష్మములనగా నేమి? వాటికా పేర్లు ఎట్లు వచ్చెను?
సమాధానము: శ - ష - స - హ లను ఊష్మములందురు. ఊష్మము అనగా శ్వాసతో ఉచ్చరింపబడునది. ఊది పలుకబడుటచే వీటికీ పేరు వచ్చినది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు