Pages

Telugu Grammar - Samasamulu # 2

                                        తెలుగు వ్యాకరణం - సమాసములు #2

ప్రశ్న :- ఆచ్ఛిక సమాసమనగా నేమి?

సమాధానము : అచ్చ తెనుగు పదములచే నేర్పడు సమాసమును ఆచ్ఛిక  సమాసము లేదా ఆచ్ఛికము అందురు. 

ఉదా : చెఱువు యొక్క  నీరు = చెఱువు నీరు

ఇందు సమసించిన రెండు పదములు చెఱువు, నీరు అచ్చ తెలుగు పదములు.

 ప్రశ్న :- మిశ్రమసమాసమనగానేమి?

సమాధానము : తత్సమ పదములకు, అచ్చ తెనుగు పదములకు జరుగు సమాసమును 'మిశ్రమ సమాసము' లేక 'మిశ్రము' అందురు. 

ఉదా : సముద్రము యొక్క ఒడ్డు = సముద్రపు బొడ్డు

ఇందు సముద్రము - తత్సమపదము

ఒడ్డు - అచ్చ తెనుగు పదము 

ఈ రెండింటికి సమాసము జరిగినది కావున ఈ సమాసము మిశ్రము.

 ప్రశ్న :- పద ప్రాధాన్యమును బట్టి సమాసములను ఎన్ని విధములుగా విభజింపవచ్చును? అవి ఏవి?

సమాధానము : పదముల యొక్క అర్ధ ప్రాధాన్యతను బట్టి సమాసములను ఆరు విధములుగా విభజించవచ్చును. అవి :

 1. అవ్యయీభావము. 2. తత్పురుషము. 3. కర్మ ధారయము 4. ద్విగువు 5. ద్వంద్వము  6. బహువ్రీహి 

ప్రశ్న :- అవ్యయీభావ సమాసమును గూర్చి వ్రాయుము?

సమాధానము : అవ్వయమునకు ఇతర పదమునకు కల్గిన సమాసమును అవ్యయీభావ సమాసమందురు. ఇందు మొదటి పదముగా అవ్యయము ఉండును. 

ఉదా : యధావిధి = విధి యెట్లో అట్లు

అనుదినము = ప్రతిదినము

 ఇది పూర్వ పదార్ధ ప్రధానము. అవ్యయీభావ సమాసములన్నియు సిద్ధ సాంస్కృతిక సమాసములే. 

ప్రశ్న :- తత్పురుషమనగానేమి? వివరింపుము?

సమాధానము : ఉత్తర పదము (అనగా రెండవ పదము లేక సమాసమందలి చివరి పదము) ప్రధానముగా నున్న సమాసమును తత్పురుషము లేక తత్పురుష సమాసమందురు. దీనినే వ్యధికరణ సమాసమందురు. వ్యధికరణ మనగా అర్ధవంతమును, అన్వయమును ఉన్న వేఱు పదముల వలన గలుగునది అని అర్ధము. తత్పురుష సమాసములో పూర్వ పదము (మొదటి పదము) ద్వితీయ మున్నగు విభక్తులతో కూడి యుండును.

సమాసములో విభక్తి లోపించును. విగ్రహవాక్యము చెప్పునపుడు ఆ విభక్తిని కూడ చెప్పవలెను. 

ఉదా : రాజభటుఁడు గస్తీ తిరిగెను.

గస్తీ తిరుగునది ఎవరు? రాజా? భటుడా? 

'భటుడే  కావున ఇందు రెండవ పదము యొక్క అర్ధము ముఖ్యము. 'రాజభటుఁడు' (రాజు యొక్క భటుఁడు) అనునది తత్పురుష సమాసము 

ప్రశ్న :- తత్పురుష సమాసము ఎన్ని విధములు? అవి ఏవి?

సమాధానము : మొదటి పదము చివరనున్న విభక్తులను బట్టి తత్పురుష  సమాసము ఏడు విధములుగా విభజింపబడినది. అవి:

1. ద్వితీయా తత్పురుషము. 

2. తృతీయా తత్పురుషము. 

3. చతుర్థీ తత్పురుషము. 

4. పంచమీ తత్పురుషము.

5. షష్ఠీ తత్పురుషము. 

6. సప్తమీ తత్పురుషము. 

7. నఞ్ తత్పురుషము. 

త్పురుష సమాసములను వివరింపుము?

1. ద్వితీయా తత్పురుష సమాసము :- మొదటి పదము (పూర్వ పదము) చివర ద్వితీయా విభక్తి ఉన్న తత్పురుష సమాసమును ద్వితీయా తత్పురుష సమాసమందురు. 

ఉదా : సమాసము- విగ్రహవాక్యము

జలధరము - జలమును ధరించునది 

జటాధారి- జడలను ధరించినవాఁడు

నెలతాల్పు- నెలను తాల్చినవాఁడు 

2. తృతీయా తత్పురుష సమాసము :- తృతీయా విభక్త్యంతమైన పూర్వపదముగ గల తత్పురుషసమాసమును తృతీయా తత్పురుషసమాసమందురు. 

ఉదా : రాజపూజితుఁడు- రాజు చేత పూజితుఁడు

బుద్ధిహీనుఁడు- బుద్ధి చేత హీనుఁడు 

3. చతుర్థీ తత్పురుష సమాసము :- చతుర్దీ విభక్తి  చివర నున్న పూర్వ పదముగల తత్పురుష సమాసమును చతుర్థీ తత్పురుష సమాసమందురు. 

ఉదా : ధనాశ- ధనము కొఱకు ఆశ

వంట కట్టెలు- వంట కొఱకు కట్టెలు

భూత బలి- భూతముల కొఱకు బలి 

4. పంచమీ తత్పురుష సమాసము :- పంచమీ విభక్త్యంతమైన పూర్వపదముగల తత్పురుష సమాసమును పంచమీ తత్పురుష సమాసమందురు. 

ఉదా : దొంగ భయము- దొంగ వలన భయము

స్వర్గ పతితుఁడు- స్వరము నుండి పతితుఁడు (పడినవాడు)

6. షష్ఠీ తత్పురుష సమాసము :- షష్ఠీ విభక్తి చివరనున్న పూర్వ పదముగల సమాసమును షష్ఠీ తత్పురుష సమాసమందురు. 

ఉదా : శ్రీరాముని దయ- శ్రీరాముని యొక్క దయ

భుజబలము- భుజము యొక్క బలము

ఇంద్ర చాపము- ఇంద్రుని యొక్క చాపము 

6. సప్తమీ తత్పురుష సమాసము :- సప్తమీ విభక్తి చివరనున్న పూర్వపదము గల సమాసమును సప్తమీ తత్పురుష సమాసమందురు. ఉదా : మాటనేర్పరి- మాట యందు నేర్పరి

దైవ భక్తి- దైవము నందు భక్తి

పురజనులు- పురము నందలి జనులు 

వ్యాకరణ పండితుఁడు- వ్యాకరణము నందు పండితుఁడు 

7. నఞ్ తత్పురుష సమాసము :- 'నఞ్' అనునది వ్యతిరేకార్ధమును తెల్పును. నఞ్ కు అచ్చు పరమైన 'అన్' అనియు, హల్లు పరమైన 'అ' అనియు ఆదేశమగును. అన్, అ-లు పూర్వ పదములుగా నున్న సమాసమును నఞ్ తత్పురుష సమాసమందురు. 

ఉదా : నఞ్ + ఉచితము = అనుచితము- ఉచితము కానిది

నఞ్ + న్యాయము = అన్యాయము- న్యాయము కానిది

నఞ్ + మితము = అమితము- మితము కానిది

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు