Pages

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 4

     వేమన పద్యరత్నాకరము -  ఉసురులేని తిత్తి యినుమంత వూదిన 

ఉసురులేని తిత్తి యినుమంత వూదిన 
వంచ లోహములును భస్మమౌను 
పెద్ద లుసురు మంటె పెనుమంట లెగయవా 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  ఇనుప కొలిమిని ఊదే తిత్తికి ఉసురులేదు. అది కొద్దిపాటి ఊదినా పంచలోహాలూ బూడిదైపోతాయి. పెద్దవారిని ఉసురు పెడితే కానరాని మంటలు తిత్తి ఊదగా కొలిమి నుండి బయలు వెడలిన పెనమంటలకంటే 
ఎన్నో రెట్లు మహాజ్వాలలు రేగును.

 వేమన పద్యరత్నాకరము -  మందు దిన బోటు మానును 

మందు దిన బోటు మానును 
మందు దినగజేయ పొలతి మహిలో వలచున్ 
మందు దిన కుదురు రోగము
మందు దినంగలదు పుష్టి మహిలో వేమ ! 

అర్థం:  మందు వాడితే బాధ తగ్గును. వలపు పెరగడానికి కాంతకు మందురాస్తే   ప్రేమిస్తుంది. ఇంకా ఔషధ సేవ వల్ల జబ్బు నయం అవుతుంది. మందు పుచ్చుకు ఒంటికి కావలసిన పుష్టి చేకూరుతుంది.

వేమన పద్యరత్నాకరము -  తలను పాగ పైని తగు పచ్చడము బొజ్జ 

తలను పాగ పైని తగు పచ్చడము బొజ్జ 
చెవుల పోగు లరసి జేరునర్థి; 
శుద్ధ పశువు లౌట బుద్ధిలో నెరుగక 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:   వేషభాషలు చూచి యాచకుడు వెంటపడతాడు. వాడు పశువు అని ఆలస్యంగా తెలుసుకుంటాడు పాపము.

వేమన పద్యరత్నాకరము -  స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ 

స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ 
సేయని మనుజుండు చెడు నిజంబు; 
యేటి గట్టు మానుకెప్పుడు చలనంబు? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  మనసు నిలుపలేనివాడు పతనమౌతాడు. స్త్రీ సుఖం కోసం ప్రాకులాడే మనిషి ఏటిగట్టుదారి నున్నచెట్టులా చలనం పొందుతాడు. 

వేమన పద్యరత్నాకరము -  కూలి నాలి జేసి గుల్లాపు పనిజేసి, 

కూలి నాలి జేసి గుల్లాపు పనిజేసి, 
తెచ్చి పెట్ట యాలు మెచ్చ నేర్చు; 
లేమి జిక్క విభుని వేమారు దిట్టును 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: కూలినాలి చేసి ఏదో విధంగా నాలుగు డబ్బులు సంపాదిస్తుంటే భార్య ఎంతగానో మెచ్చుకుంటుంది. పేద తనంతో బాధపడే సమయంలో ఆ భార్యే భర్తని సూటిపోటి మాటలతో వెయ్యి విధాలుగా దూషిస్తుంది.

వేమన పద్యరత్నాకరము -  ఇంద్రియ పరవశుడధముం 

ఇంద్రియ పరవశుడధముం 
డింద్రియ పరవశుడు భక్తియెడ మధ్యముడౌ; 
నింద్రియ జయు డుత్తముడు జి 
తేంద్రియ సమ్మదుడు విన మహేశుడు వేమా !

అర్థం: కేవల ఇంద్రియ సుఖాలనే కోరినవాడు అధముడు భక్తి భావనవల్ల ఇంద్రియ పరవశుడయితే అట్టి మధ్యముడు ఇంద్రియ సుఖాలనుండి విరక్తి పొందినవాడు ఉత్తముడు జితేంద్రియుడు సర్వదా శ్లాఘనీయుడవుచు, అట్టివాడు యోగులలో పరమయోగి అగువాడు మహేశ్వరుడు.

వేమన పద్యరత్నాకరము -  తన గుణము తనకు నుండగ

తన గుణము తనకు నుండగ
నెనయంగా నొరుని గుణము నెరిచును మదిలో 
తన గుణము తాను దెలియక; 
బరు నిందంజేయువాడు భ్రష్టుడు వేమా!

అర్థం: తనలో తప్పు తెలుసుకోలేక విశేషంగా ఇతరుల తప్పు ఎన్నుతుంటాడు. తనలో గల లోపాలు గ్రహించుకోకుండా పరులను నిందించువాడు భ్రష్టుడు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు