Pages

Showing posts with label Annamacharya Keerthanalu. Show all posts
Showing posts with label Annamacharya Keerthanalu. Show all posts

అన్నమయ్య కీర్తన - నీవు పరిపూర్ణుడవు స్వామీ!

 అన్నమయ్య కీర్తన - నీవు పరిపూర్ణుడవు స్వామీ! 

నే నేమిఁ జేయగలేను నీవు పరిపూర్ణుఁడవు 
హీనుఁడ నే నధికుడ వన్నిటా||

దండము పెట్టుట నాది తప్పు లోఁగొనుట నీది
నిండి నీ వెప్పుడు దయానిధివి గాన,
అండఁ జేరుకొంట నాది అందుకు నూఁ కొంట నీది
దండియైన దేవ దేవోత్తముఁడవు గాన | (1)

శరణు చొచ్చుట నాది సరుగఁ గాచుట నీది 
పరమ పురుష శ్రీపతివి నీవు
విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది 
పొరి నీవు భక్త సులభుఁడ వటు గాన || (2) 

దాసుఁడ ననుట నాది తప్పక యేలుట నీది
ఆసదీర్చె వరదుఁడ వటుగాన
నీ సేవ యొక్కటి నాది నిచ్చలు గై కొంట నీది 
యీసులేని శ్రీవేంకటేశుఁడవు గాన॥ (3) 
                                            (అధ్యాత్మ సంకీర్తన- 2-433 )
అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో 'జీవుని' సేవకత్వమును, 'దేవుని' రక్షకత్వమును విశదపరుస్తున్నారు.
       'స్వామీ! నేను అల్పుడను. నీవు పరిపూర్ణస్వరూపుడవు. ఎట్టి శక్తిలేని నేను హీనుడైన జీవాత్ముణ్ణి. నీవు అన్ని విధాల గొప్పవాడవైన పరమాత్ముడవు. నీకు నమస్కరించుట నా పని. నా తప్పులు సరిదిద్ది క్షమించుట నీ పని. ఎందుకంటే, నీవు పరిపూర్ణుడైన కరుణానిధివి కదా! నీ నామములు అనగా పేర్లు పేర్కొనుటయే నా పని. పలుకుట నీ పని. నిన్ను శరణు వేడుట నా కర్తవ్యం. రక్షించడం నీ కర్తవ్యం. ఎందుకంటే నీవు శరణాగత తత్పరుడవు. పూలతో పూజించుట నా వంతు. నాకు వివిధ సంపదలనివ్వడం నీ పని. ఎందుకంటే నీవు భక్తసులభుడవు కదా! 
           నేను నీ దాసుడవటం నా కర్తవ్యం. నా పై దయ జూపి కాపాడడం నీ కర్తవ్యం. ఎందుకంటే దాసుల ఆశలు తీర్చే వాడివి కదా! ఈ విధంగా మిమ్మల్ని  సదా సేవించుటయే నా పని. నా సేవలను ఎప్పుడూ అంగీకరించడమే నీ పని. ఎందుకంటే నీవు ఈర్ష్య లేని వాడవు కదా!' అని అన్నమయ్య కీర్తిస్తున్నారు. 



Annamacharya Keerthana - Nityatmudai Yundi

                                       అన్నమాచార్య కీర్తన - నిత్యాత్ముడై యుండి 

నిత్యాత్ముడై యుండి 
నిత్యుడై వెలుగొందు 
సత్యాత్ముడై యుండి 
సత్యమై తానుండు 
ప్రత్యక్షమై యుండి 
బ్రహ్మమై యుండు 
సంస్తుత్యుడీ 
తిరువేంకటాద్రివిభుడు 

Annamacharya Keerthana - Tane Tane Indari Gurudu....

                                          అన్నమాచార్య కీర్తన - తానె తానే  యిందరి  గురుడు.... 
తానె తానే యిందరి గురుడు /
సానబెట్టిన భోగి జ్ఞాన యోగి//

అపరిమితములైన యజ్ఞాల వడిజేయ/
బ్రపన్నులకు బుద్ధి వచరించి/
తపముగా ఫలత్యాగము సేయించు /
కపురుల గరిమల కర్మయోగి//

అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ/
మన్నించు బుద్ధులను మరుగజెప్పి/
ఉన్నతపదమున కొనరగ గరుణించు/
పన్నగశయనుడై బ్రహ్మయోగి //

తనరగ గపిలుడై దత్తాత్రేయుడై/
ఘనమైన మహిమ శ్రీవేంకటరాయుడై/
ఒనరగ సంసార యోగము గృపసేయు/
అనిమిషగతుల నభ్యాసయోగి// 

                                                                  (సంపుటం - 4 - 355)

తాత్పర్యం: ఆనందనిలయుడు అందరికీ గురువు! ఆ స్వామి భోగిగా ప్రకాశిస్తున్న అద్భుతమైన జ్ఞానయోగి! యజ్ఞాలే పరమార్థంగా భావిస్తున్న వాళ్లచేతనే యాగఫలాలను త్యాగం చేయిస్తున్న శ్రీవేంకటేశ్వరుడు విచిత్రమైన కర్మయోగి! సమస్త కార్యాలను బ్రహ్మార్పణ బుద్దితో చేయడం మంచిది అంటూ, అలాంటి వారిని ఉన్నత స్థానాల్లో నిలుపుతున్న బ్రహ్మయోగి శ్రీశేషశాయి శ్రీనివాసుడు! ఒకప్పుడు కపిలుడిగా, మరొక్కప్పుడు శ్రీదత్తాత్రేయస్వామిగా అవతరించిన శ్రీవేంకటేశ్వరుడు, 'సంసారం కూడా ఒక యోగం' అంటూ ప్రస్తుతం సామాన్యులను కూడ  రెప్పవాల్చకుండా అనుగ్రహించడానికి అభ్యాసం చేసిన పరమయోగి ఆనందనిలయుడు!

Annamacharya Keerthana - Ehaparasaadhana

                                          అన్నమాచార్య కీర్తన - ఇహపరసాధన 
ఇహపరసాధన మిది యొకటే 
సహజపు మురారి సంకీర్తననొకటే 

భవసాగరముల బాపెడిది తేప 
భువి నజ్ఞానముపులి వాకట్టిది 
జవళి నాశాపాశములకు కొడువలి 
నవనీతచోరు నామం బొకటే 

చింతా తిమిరము చెరచేటి సూర్యుడు 
అంతట దరిద్రపూతపు నిధానము 
వింత మరణభయవినాశ మంత్రము 
మంతుకు పూరినామంబిది యొకటే 

మించు దుఃఖముల మృతసంజీవని 
అంచల పంచేంద్రియముల కంకుశము 
ఎంచగ శ్రీ వెంకటేశు దాసులకు 
పంచిన పాళ్ళ పరగిన దొకటే  
                                                                  (సంపుటం - 04, సంకీర్తనం - 16)

తాత్పర్యం: ఈ సంకీర్తనలో ఇహపరాలను సాధించడానికి సాధనము 'మురారి సంకీర్తనమొకటేనని' చాటి చెబుతూ, భవబంధాలను, అజ్ఞానాంధాకారాలను, దారిద్యాన్ని, మరణభయాన్ని, పలు బాధలను, పంచేద్రియాల వికారాలను ఏ విధంగా రూపు మాపాలో చక్కగా స్పష్టం చేస్తున్నాడు అన్నమయ్య! 

Annamacharya Keerthana - Urake Dorakunaa

                                          అన్నమాచార్య కీర్తన - ఊరకే  దొరకునా 
ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము 
సారంబు దెలిసికా జయము చేకొనుట 

తలఁపు లోపలిచింత దాఁటినప్పుడు గదా!
అలరి దైవంబు ప్రత్యక్షమౌట,
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా!
తలకొన్న మోక్షంబు తనకుఁ జేపడుట

కర్మంబు కసటువోఁ గడిగినప్పుడు గదా!
నిర్మలజ్ఞానంబు నెరవేరుట,
మర్మంబు శ్రీహరి నీ మఱఁగు చొచ్చినఁ గదా!
కూర్మిఁ దన జన్మ మెక్కుడు  కెక్కుడౌట 

తనశాంత మాత్మలోఁ దగిలినప్పుడు  గదా!
పనిగొన్న తన చదువు ఫలియించుట 
ఎనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు 
తనకు నచ్చినఁ గదా దరిచేరి మనుట 
                                                                  (సంపుటం - 02, సంకీర్తనం - 104)

తాత్పర్యం: ప్రయత్నించకపోతే లోకములో ఏదీ లభించదు. ఎంత గొప్ప లాభాన్ని కోరుకుంటామో, అంత గొప్ప ప్రయత్నాన్ని చేయాలి మనము. కానీ, ప్రతి జీవి 'సుఖమునే' కోరుచున్నది. సుఖము - నిత్యము, అనిత్యమని రెండు రకాలు. ప్రాపంచిక సుఖాలన్నీ అనిత్యాలే. మోక్ష సుఖమొక్కటే నిత్యము. అందుకే అది 'ఉన్నతోన్నత సుఖము' గా అన్నమయ్య కీర్తిస్తున్నారు. 

Annamacharya Keerthana - Konaro Konaro Miru Kurimimandu

అన్నమాచార్య కీర్తన - కొనరో కొనరో మీరు కూరిమిమందు  
కొనరో కొనరో మీరు కూరిమిమందు 
ఉనికి మనికి కెల్ల నొక్కటే మందు 

ధ్రువుడు  గొనినమందు తొల్లియుఁ బ్రహ్లాదుడు 
చవిగాఁ గొనిన మందు చల్లని మందు 
భవరోగములు వీడి పారఁగ బెద్దలు మున్ను 
జవకట్టికొనిన నిచ్చలమైన మందు 

నిలిచి నారదుఁడు గొనినమందు జనకుఁడు 
గెలుపుతో గొని బ్రతికిన యా మందు 
మొలచి నాలుగుయుగముల రాజులు ఘనులు 
కలకాలముగొని కడగన్న మందు 

అజునకుఁ బరమాయువై యెసఁగిన మందు 
నిజమై లోకములెల్ల నిండిన మందు 
త్రిజగములు నెఱుఁగఁ తిరువేంకటాద్రిపై 
ధ్వజమెత్తె గోనేటి దరినున్న మందు                     (సంపుటం - 01, సంకీర్తన - 237)

అర్థము : బ్రహమదేవుడు భగవంతుడినే పరమౌషధం పరమాయువై విలసిల్లినది. ఇదే సత్యస్వరూపమై భువనములెల్ల నిండియున్నది. ఇది ఎట్టి ఉద్వేగాన్ని కల్గించని చల్లని మందు. స్వామి పుష్కరిణి గట్టుననున్న ఈ మందే ముల్లోకాలకు "నాలాగా పరిమార్పగలిగే మందు ఇంకొక్కటి లే" దని  శ్రీవేంకటాద్రిపై రథమెక్కి చాటినది. 

                                   సంసారరోగాల్ని పోగొట్టుకోవడానికై ఈ ఔషధాన్నే పూర్వం స్వామి పరమభక్తులు నారదుడు, జనకుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు మిక్కిలి ప్రీతితో స్వీకరించారు. నాలుగు యుగాలకు చెందిన నరపతులు, మహాత్ములు ఈ మందునే సేవించి ముక్తులయ్యారు. 

                                   కాబట్టి ఓ జనులారా! ప్రేమస్వరూపుడైన భగవంతుడనే పరమౌషధాన్ని మీరూ స్వీకరించండి. లోకంలో సుఖంగా జీవించటానికి ఇదొక్కటే శరణాగతి మందు అంటూ అన్నమయ్య ఈ సంకీర్తనలో ఉద్భోదిస్తున్నాడు. 

Annamacharya Keerthana - Kommalaala

                  అన్నమాచార్య కీర్తన - కొమ్మలాలా ఎంతవాడె గోవిందరాజు
కొమ్మలాలా ఎంతవాడె గోవిందరాజు 
కుమ్మరించే రాజసమే గోవిందరాజు //

ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి 
కొలువు సేయించుకొనీ గోవిందరాజు 
జలజాక్షు లిద్దరును సరిపాదా లొత్తగాను 
కొలదిమీర మెచ్చేని గోవిందరాజు //

అదె నాభికమలాన అజుని పుట్టించి తాను 
కొదలేక వున్నవాడు గోవిందరాజు 
చెదరక తన వద్ద సేవ సేసే సతులకు 
గుదిగుచ్చే వలపులు గోవిందరాజు //

ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకేల 
కొప్పు కడునెత్తినాడు గోవిందరాజు 
ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంఖు చక్రాలు 
కుప్పె కటారము బట్టె గోవిందరాజు //(సంపుటం 7 - సంకీర్తన 470)

భావము : ఈ సంకీర్తనలో అన్నమయ్య తిరుమల కొండ దిగువన ఉన్న తిరుపతి పట్టణంలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారిని వర్ణిస్తున్నాడు. ఘనరాజసం ఉట్టిపడేటట్లు గోవిందరాజస్వామి శయనించి ఉన్నాడు. దేవేరులిరువురు స్వామివారి పాదాలు ఒత్తుతూ ఉండగా స్వామి కొలువు చేశాడని అన్నమయ్య అనేక విశేషాలతో శ్రీ గోవిందరాజస్వామిని సంకీర్తించాడు.  

Annamacharya Keerthana - Kattedura Vaikunthamu

అన్నమాచార్య కీర్తన - కట్టెదుర వైకుంఠము 
కట్టెదుర వైకుంఠము కాణాచయినా కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమలకొండ//

వేదములే శిలలై వెలసినది కొండ 
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ 
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ 
శ్రీదేవుడుండేటి శేషాద్రి యీ కొండ 

సర్వదేవతలు మృగజాతువులై చరించే కొండ 
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ 
వుర్విదపసలే తరువులై నిలిచిన కొండ 
పూర్వపు టంజనాద్రి యీ పొడవాటి కొండ 

వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ 
పరుగు లక్ష్మికాంతు సోబనపు గొండ 
కురిసి సంపదలెల్ల గుహలనిండిన కొండ 
విరివైన దిదివో శ్రీ వేంకటపు గొండ 

అర్థము : కట్టెదుట కనిపించే వైకుంఠమే ఈ వేంకటాచలం. ఇక్కడి తేనెతెట్టెలన్నీ మహిమలే! వేదాలే శిలలై వెలుగుతున్నాయి ఇక్కడ. బ్రహ్మాదిలోకాలకు చివరిది ఈ కొండ. శ్రీదేవుడుండేది శేషాద్రి ఈ కొండ. సకలదేవతలు మృగజాతులై సంచరిస్తారిక్కడ! సముద్రాలే సానువులయింది - ఈ కొండ. మునుపటి అంజనాద్రే ఈ పొడవైన కొండ. వరాలు అధికంగా పెంచేదీ కొండ. లక్ష్మి కాంతుని సుఖాలకు నిలయం - ఈ కొండ. సంపదలు పుష్కలముగా ఉండే గుహలు - ఈ కొండ. చాలా విశాలమైనది - ఈ కొండ. 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు