Pages

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు

  వేమన పద్యరత్నాకరము -  నీటిలోన మొసలి నిగిడి యేనుగుబట్టు   

నీటిలోన మొసలి నిగిడి యేనుగుబట్టు 
బైట కుక్కచేత భంగపడును 
స్థాన బలిమిగాని తనబల్మి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: నీటిలో ఉన్న మొసలి యేనుగును కూడా లోపలికి యీడ్చుకు  పోగలుగుతుంది. అదే మొసలి నేల మీద ఉంటే కుక్కకి కూడా భయపడిపోతుంది. ఆలోచించి చూడగా అదంతా స్థానబలం అని తెలుస్తుంది.

 వేమన పద్యరత్నాకరము -  కులములో నొకండు గుణవంతు డుండిన   

కులములో నొకండు గుణవంతు డుండిన 
కులము వెలయు వానిగుణముచేత; 
వెలయ వనములోన మలయజంబునట్లు 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  వంశంలో గుణవంతుడెవడైనా ఉన్నాడా! ఆ వంశము అంతా కీర్తి  కెక్కుతుంది. అదెలాగంటే వనంలో ఒక గంధ వృక్షం ఉంటే ఆ వనం అంతా గంధపూరితమై కీర్తికెక్కుతుంది.

వేమన పద్యరత్నాకరము -  పంది పిల్లలీను పదియు నైదింటిని  

పంది పిల్లలీను పదియు నైదింటిని
కుంజరంబు యీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు యొక్కడు జాలడా 
విశ్వదాభిరామ వినుర వేమ!4

అర్థం: పంది పదిహేను పిల్లన్ని కంటుంది. కాని యేనుగు ఒక్కపిల్లనే కంటుంది. అది చాలదా. ఎంతో మంది పనికిమాలిన వారిని కనడం కంటే మంచివాణ్ణి ఒక్కణ్ణి కంటే చాలు..,అని భావం. 

వేమన పద్యరత్నాకరము -  ఎరుగువాని దెలుప నెవ్వడైనను జాలు

ఎరుగువాని దెలుప నెవ్వడైనను జాలు
నొరుల వశముగాదు ఓగుదెల్ప
యేటివంక దీర్ప నెవ్వరితరమయా
విశ్వదాభిరామ వినుర వేమ !

అర్థం: బుద్ధిమంతునికి బోధించడం చాలా సుళువు. ఏటికి ఒంకర తీర్చడం లాగే మందబుద్ధికి తెలపడం మహాకష్టం.

వేమన పద్యరత్నాకరము -  అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బలుకు చల్లగాను 
కంచుమ్రోగునట్లు కనకంబు మోగునా ? 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: అల్పుడు మితిమీరిన ఆడంబరంతో మాట్లాడుతాడు. సత్పురుషుడు చల్లగా మాట్లాడుతాడు. ఎలాగంటే కంచు మ్రోగునట్లు బంగారం మ్రోగదు కదా... అని భావం. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు